ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు: పోలీస్ కమిషనర్
సైబర్ మోసగాళ్లు నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లు, వెబ్ సైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెబుతూ పెట్టుబడిదారులను ఆకర్షించి మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్
తెలిపారు. కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద IPO (Initial Public Offering) వస్తుందంటూ…తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని,“త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది” అంటూ వాట్సాప్. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
మోసం జరిగే విధానం
మోసగాళ్లు పెద్ద కంపెనీ IPO వచ్చిందని నమ్మదగిన ప్రకటనలు, నకిలీ వెబ్ సైట్ లు సృష్టిస్తారు. ఆ లింక్ లేదా ఫారమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు, Aadhaar, PAN లేదా UPI ద్వారా చెల్లింపులు చేయమని చెబుతారు. డబ్బు బదిలీ చేసిన తర్వాత మోసగాళ్లు వెబ్ సైట్ మూసేసి మాయం అవుతారు.కొన్నిసార్లు నకిలీ షేర్ సర్టిఫికేట్లు లేదా రసీదులు కూడా పంపి మోసం చేస్తారు.
జాగ్రత్త సూచనలు
IPO పెట్టుబడి పెట్టే ముందు SEBI లేదా NSE/BSE అధికారిక వెబ్ సైట్లో లో ఆ కంపెనీ నిజంగా IPO నమోదు అయిందో లేదో ధృవీకరించుకోవాలి.
సోషల్ మీడియా లేదా వ్యక్తిగత మెసేజ్ ల ద్వారా వచ్చిన IPO ఆఫర్లను నమ్మవద్దు.
ఎవరైనా ముందుగా “అడ్వాన్స్ పేమెంట్” లేదా “రిజిస్ట్రేషన్ ఫీజు” అడిగితే డబ్బు పంపవద్దు.
నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ మోసం
తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తాయని
సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ గ్రూపులు లేదా టెలిగ్రామ్ ఛానెల్ ల ద్వారా “రోజుకు వేలల్లో లాభం”, “100% రిటర్న్” అంటూ ప్రకటనలు చేస్తారు.
మొదట యాప్ లేదా వెబ్ సైట్లో రిజిస్టర్ చేయమని చెబుతారు.
చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభం చూపించి నమ్మకం కలిగిస్తారు. ఆ తరువాత పెద్ద పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు.
విత్ డ్రా చేయాలంటే “ట్యాక్స్”, “సర్వీస్ చార్జ్” పేరుతో డబ్బు అడుగుతారు.
చివరికి వెబ్ సైట్ లేదా యాప్ యాక్సెస్ నిలిపివేసి, డబ్బుతో మాయమవుతారు.
ట్రేడింగ్ యాప్ లేదా వెబ్ సైట్ SEBI లేదా RBI వద్ద రిజిస్టర్ అయిందా అని తప్పనిసరిగా చెక్ చేయండి.
“గ్యారంటీడ్ రిటర్న్స్”, “డబుల్ మనీ” అని చెప్పేవారిని నమ్మకండి.
సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ యాప్లు లేదా వెబ్ సైట్ లను ఉపయోగించకండి.
ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయండి.









